ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ II

ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ II: ది ఏజ్ ఆఫ్ కింగ్స్ అన్నది ఎన్సెంబుల్ స్టూడియోస్ అభివృద్ధి చేయగా, మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన రియల్ టైమ్ స్ట్రాటజీ వీడియో గేమ్ . మైక్రోసాఫ్ట్ విండోస్, మాకింతోష్ ఆపరేటింగ్ సిస్టంల కోసం 1999లో విడుదలైంది, ఇది ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ సిరీస్‌లో రెండవ గేమ్. దీనికి కొనసాగింపు, ది కాంకరర్స్, 2000 లో విడుదలైంది.

Age of Empires II: The Age of Kings
Developer(s)ఎన్సెంబుల్ స్టూడియోస్
Publisher(s)మైక్రోసాఫ్ట్ (విన్, మేక్)
కోనమీ (పీఎస్2)
Designer(s)బ్రూస్ షెల్లీ[2]
Programmer(s)ఏంజెలో లాడన్
Artist(s)
  • బ్రాడ్ క్రౌ
  • స్కాట్ విన్సెట్
Composer(s)స్టీఫెన్ రిప్పీ
SeriesAge of Empires
Engineజీనీ ఇంజన్
Platform(s)మైక్రోసాఫ్ట్ విండోస్, మేక్ ఆపరేటింగ్ సిస్టమ్, ప్లేస్టేషన్ 2
Releaseవిండోస్మేక్ ఓఎస్
  • WW November 30, 2001[1]
ప్లేస్టేషన్ 2HD ఎడిషన్
  • WW April 9, 2013
Genre(s)రియల్ టైమ్ స్ట్రాటజీ
Mode(s)సింగిల్ ప్లేయర్, మల్టీ ప్లేయర్

ఏజ్ ఆఫ్ కింగ్స్ ఆటలో మధ్య యుగాల కాలం నడుస్తున్నట్టు ఉంటుంది. ఇందులో పదమూడు నాగరికతలు ఉంటాయి. ఆటగాళ్ళ ఆ పదమూడింటిలో ఏదో ఒకటి ఎంచుకుని ఆడవచ్చు. ఆటగాళ్ళు వనరులను సేకరించి, వాటిని పట్టణాలను నిర్మించి, సైన్యాన్ని సృష్టించి, తమ శత్రువులను ఓడించడానికి ఉపయోగిస్తారు. చరిత్రలోని వివిధ సందర్భాల ఆధారంగా రూపొందించిన ఐదు కాంపైన్లు ఇందులో ఉన్నాయి. వీటన్నిటికీ ఒక్కో కథా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో నియమ నిబంధనల మధ్య ఆటగాళ్ళు కాంపైన్ పూర్తిచేయాల్సి ఉంటుంది. వీటికి తోడు మరో మూడు సింగిల్ ప్లేయర్ గేమ్ మోడ్‌లు అదనంగా ఉన్నాయి. అలాగే, దీనిలో మల్టీప్లేయర్ మద్దతు కూడా ఉంది. ఏజ్ ఆఫ్ అంపైర్స్ సీరీస్‌లో రెండవదిగా రావాల్సిన ఈ ఏజ్ ఆఫ్ కింగ్స్ అనుకున్నదాని కన్నా ఆలస్యం కావడంతో ఎన్సేంబుల్ స్టూడియోస్ వారు 1998లో మధ్యలోనే ఏజ్ ఆఫ్ ఎంపైర్స్: ద రైజ్ ఆఫ్ రోమ్ విడుదల చేయాల్సి వచ్చింది.

ది ఏజ్ ఆఫ్ కింగ్స్‌కు చాలా సానుకూలమైన స్పందన వచ్చింది. ఆటకు చేసిన మెరుగుదల, కొత్త ఫీచర్లు చాలా ప్రశంసలు పొందాయి. వీడియో గేమ్ రివ్యూ అగ్రిగేటర్ మెటాక్రిటిక్ ప్రకారం, ఏజ్ ఆఫ్ కింగ్స్ "సార్వత్రిక ప్రశంసలు" అందుకుంది. విడుదలైన మూడు నెలల తరువాత, ది ఏజ్ ఆఫ్ కింగ్స్ రెండు మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి, ఇది ఏడు దేశాలలో అమ్మకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఆట అనేక పురస్కారాలను గెలుచుకుంది. ఈనాడు ఆ తరం ఆటల్లో ఒక క్లాసిక్‌గా పరిగణిస్తున్నారు, తర్వాత వచ్చిన ఆటలపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఒరిజినల్ ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ II, ఎక్స్‌పాన్షన్ ప్యాక్ తరువాత ది గోల్డ్ ఎడిషన్‌గా విడుదలయ్యాయి. ఇప్పుడు ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ IIను చరిత్రలోకెల్లా అతి గొప్ప ఆటల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు.

2013 ఏప్రిల్లో, మైక్రోసాఫ్ట్ విండోస్ కోసం ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ II: HD ఎడిషన్ను స్టీమ్ డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫాంలో విడుదల చేశారు. HD ఎడిషన్‌లో ఒరిజినల్ ఆట, ఎక్స్‌పాన్షన్ అయిన ది కాంకరర్స్, అలాగే హై-రిజల్యూషన్ డిస్ప్లేల కోసం నవీకరించిన గ్రాఫిక్స్ ఉన్నాయి. ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ II: డెఫినిటివ్ ఎడిషన్ అన్న డెఫినిటివ్ రీమాస్టర్ 2019 నవంబరులో విడుదలైంది.

ఆటలో పద్ధతులు

మార్చు

ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ II అన్నది రియల్ టైమ్ స్ట్రాటజీ గేమ్, దీనిలో పట్టణాలను నిర్మించడం, వనరులను సేకరించడం, ప్రత్యర్థులను ఓడించడానికి సైన్యాన్ని సృష్టించడం ప్రధానం. ఆటగాళ్ళు 13 నాగరికతలలో ఒకదానిని ఎంచుకుని, డార్క్ ఏజ్ మొదలుపెట్టి, ఫ్యూడల్ ఏజ్, కాజిల్ ఏజ్ నుంచి ఇంపీరియల్ ఏజ్ (పునరుజ్జీవనాన్ని గుర్తుచేసేదిది) వరకూ అభివృద్ధి చెందుతూ శత్రువుల పట్టణాలను జయించాలి.[3] తర్వాతి ఏజ్‌కు చేరుకోవడం వల్ల కొత్త యూనిట్లు, నిర్మాణాలు, సాంకేతికతలు అన్లాక్ అవుతూ ఉంటాయి. కొత్త ఏజ్‌కు చేరుకునేందుకు ఆటగాళ్ళు మొదట వారి ప్రస్తుత ఏజ్‌కు చెందిన కొన్ని భవనాలను నిర్మించి, తరువాత వనరులను (సాధారణంగా ఆహారం, బంగారం) ఖర్చుచేయాల్సి ఉంటుంది. [4]

"విలేజర్స్" (గ్రామస్తులు) అని పిలిచే పౌర యూనిట్లను వనరులను సేకరించడానికి ఉపయోగిస్తారు. ఇతర విషయాలతోపాటు, యూనిట్లకు శిక్షణ ఇవ్వడానికి, భవనాలను నిర్మించడానికి, సాంకేతిక పరిజ్ఞానాలకు పరిశోధించడానికి ఈ సేకరించిన వనరులను ఉపయోగించవచ్చు; ఉదాహరణకు, ఆటగాళ్ళు తమ ఇన్‌ఫాంట్రీ యూనిట్ల కోసం మంచి కవచాన్ని పరిశోధించవచ్చు. ఆటలో నాలుగు రకాల వనరులు ఉంటాయి: ఫుడ్ (ఆహారం), వూడ్ (కలప), గోల్డ్ (బంగారం), స్టోన్ (రాయి). జంతువులను వేటాడటం, బెర్రీలు సేకరించడం, పశువుల పెంపకం, వ్యవసాయం, తీరంలో చేపలు పట్టడం, పడవల నుండి చేపలు పట్టడం ద్వారా ఆహారం లభిస్తుంది. చెట్లను నరకడం ద్వారా కలపను సేకరిస్తారు. బంగారు గనుల నుండి, వాణిజ్యం ద్వారా, రెలిక్స్ సేకరించడం ద్వారా బంగారం దొరుకుతుంది. రాతి గనుల నుండి రాయిని సేకరిస్తారు. ఇలా సేకరించిన వనరులను నిల్వ చేయడానికి గ్రామస్తులకు చెక్‌పాయింట్లు అవసరం. టౌన్ సెంటర్, మైనింగ్ క్యాంప్, మిల్లు, కలప యార్డ్ వంటివి డిపాజిటరీ బిల్డింగులుగానూ, చెక్ పాయింట్లుగానూ పనికివస్తాయి. అక్కడ వారు సేకరించిన వనరులను నిల్వ చేయవచ్చు.[5]

ప్రతి నాగరికతలోనూ ఈ వనరులను ఇంకా వేగంగా సేకరించేలా నవీకరణలను కొనుగోలు చేయవచ్చు. ఆటగాళ్ళు వాణిజ్యం కోసం మార్కెట్ స్థలాన్ని నిర్మించవచ్చు; అలాగే బంగారాన్ని ఇచ్చి, కలప, రాయి, ఆహారాన్ని కొనడం, ఇతర వనరులను కొనడానికి బంగారాన్ని ఉపయోగించడం చేయొచ్చు. ప్రతి లావాదేవీతో మార్కెట్ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి.[6] మార్కెట్లు, రేవులు విదేశీ మార్కెట్లను, ఓడరేవులను సందర్శించడానికి ఉపయోగించే బళ్ళు, పడవలను వాడి బంగారాన్ని ఉత్పత్తి చేయగలవు; అవి ఆటగాళ్ళ మార్కెట్ / డాక్‌కు తిరిగి వచ్చిన తర్వాత, బంగారం నిల్వకు చేరుతుంది. ఆ బళ్ళు ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఎక్కువ బంగారం సంపాదించవచ్చు. శత్రువుల మార్కెట్లు లేదా రేవులతో వర్తకం చేయడం సాధ్యమే, కాని ఆటగాడి వాణిజ్య యూనిట్లపై శత్రు యూనిట్లపై దాడి చేయవచ్చు లేదా నాశనం చేయవచ్చు. ఆటగాళ్ళు ట్రేడింగ్‌ను మాన్యువల్‌గా చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి వారు పోర్టును కానీ, మార్కెట్‌ను కానీ ఎన్నుకుంటే చాలు, ట్రేడింగ్ యూనిట్లు అనంతంగా వర్తకం కొనసాగిస్తాయి.

ది ఏజ్ ఆఫ్ కింగ్స్‌లో ఐదు సినారియోలు ఉన్నాయి, ఇవి చారిత్రక సంఘటనలపై ఆధారపడినవి. చెంఘిజ్ ఖాన్ యురేషియాపై చేసిన దండయాత్రలు, బార్బరోస్సా క్రూసేడ్, పవిత్ర భూమిని సలాదిన్ రక్షించడం వంటివి ఇందులో ఉన్నాయి.[7]

మూలాలు

మార్చు